Stop Fighting Your Mind: Dark Psychology వెనుక ఎవరూ చెప్పని పచ్చి నిజాలు.
మీలోని రాక్షసుడిని చంపకండి, వాడిని కేవలం గమనించండి!
మనం ఒక అద్భుతమైన నాటకంలో జీవిస్తున్నాం. ఈ నాటకానికి దర్శకుడు మన అహంకారం. ప్రేక్షకులు ఈ సమాజం. బలైపోతున్నది మాత్రం మన స్పృహ. యూట్యూబ్ తెరిస్తే చాలు, వందల కొద్దీ మోటివేషనల్ స్పీకర్లు, ఆధ్యాత్మిక గురువులు "పాజిటివ్ గా ఆలోచించండి", "చెడు ఆలోచనలను అణిచివేయండి", "మీ తప్పులకు బాధ్యత వహించండి" అంటూ ఏవేవో చెప్తుంటారు. ఇదంతా వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఇదంతా పచ్చి అబద్ధం. ఇదొక మానసిక బానిసత్వం.
చీకటి మనస్తత్వం (Dark psychology) వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బట్టబయలు చేద్దాం.
1. "నేను తప్పు చేశాను" అనడం కూడా ఒక అహంకారమే!
చాలామందికి ఒక వింతైన మేధోపరమైన దురద ఉంటుంది. తమ మనసులో ఏదైనా ఒక అసహ్యమైన, భయంకరమైన, లేదా నీచమైన ఆలోచన రాగానే, వెంటనే దాని బాధ్యత (Responsibility) తీసుకుంటున్నట్లు నటిస్తారు. "అయ్యో, నా మనసులో ఎంత ఘోరమైన ఆలోచన వచ్చింది! నేను దీనికి బాధ్యత వహిస్తున్నాను, దీన్ని సరిచేసుకుంటాను" అని తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటారు.
కానీ ఇక్కడ అసలు జుగుప్స కలిగించే నిజం ఏమిటో తెలుసా? మీరు ఆ చెడు ఆలోచనను ఒప్పుకోవడం ద్వారా, దాన్ని సరిదిద్దాలని ప్రయత్నించడం ద్వారా, మిమ్మల్ని మీరు ఒక "మంచి వ్యక్తి" (Good Boy/Good Girl) గా ప్రకటించుకుంటున్నారు. ఇది చాలా చవకబారు ట్రిక్. నీ మనసులో ఒకరిని చంపేయాలన్నంత కోపం లేదా మరొక నీచమైన ఆలోచన వస్తే, దాన్ని చూసి ఏడ్చి, కుమిలిపోయి, ప్రాయశ్చిత్తం చేసుకొని, "చూశారా, నేను నా తప్పు ఒప్పుకున్నాను, నేను ఎంత నీతిమంతుడిని" అని మీ ఇగో (Ego) కి మీరు ఒక పెద్ద పీట వేసుకుంటున్నారు.
ఒక భయంకరమైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, అక్కడ మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఏమీ చేయకూడదు. కేవలం తెలుసుకొని ఆగిపోవాలి. దాన్ని అణిచివేయడానికి (Suppression) ప్రయత్నించకండి. మీరు దాన్ని అణిచివేశారు అంటే, మీకు మీరే ఆకుపచ్చ జెండా ఊపుకొని, మీ బుజం మీరే తట్టుకుంటున్నట్లు లెక్క. "నేను చెడ్డ ఆలోచనను తొక్కేశాను, కాబట్టి నేను రాముడిని" అని ఫీలవ్వడం ఒక మానసిక రుగ్మత.
2. రక్తబీజుడి సిండ్రోమ్: ప్రతిచర్యే, ప్రతిబంధకం
పురాణాల్లో రక్తబీజుడు అనే రాక్షసుడి కథ మనందరికీ తెలుసు. వాడిని కత్తితో నరికితే, నేల మీద పడిన ప్రతి రక్తపు బొట్టు నుండి మరో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. మన అంతరంగిక ప్రపంచంలో మనసు (Mind) కూడా అచ్చం రక్తబీజుడి లాంటిదే.
మనసులో ఒక కుళ్ళు ఆలోచన లేదా ఒక నీచమైన తలంపు వచ్చినప్పుడు, మీరు దాని పట్ల ఏదైనా "ప్రతిచర్య" (Reaction) చూపించారో, ఇక అంతే సంగతులు. ఆ ఆలోచనను మీరు సమర్థించినా, లేదా తీవ్రంగా ద్వేషించినా.. ఆ ఆలోచన మరింత బలపడుతుంది. ఒక చెడు ఉద్దేశ్యాన్ని మీరు ఎంతగా అసహ్యించుకుంటే, అది మిమ్మల్ని అంతగా తన పాశంలో బంధిస్తుంది.
- తెలుసుకోవడం (Knowing) వలన ఆ ఆలోచన అక్కడితో ఆగిపోతుంది.
- ప్రతిచర్య (Reaction) వలన ఆ ఆలోచన వంద రెట్లు పెరుగుతుంది.
నీలో జరుగుతున్న ఆ చెత్తను నువ్వు కేవలం ఒక సాక్షిలా, ఒక సిసి కెమెరాలా చూడగలిగితే చాలు. దానికి నీ మద్దతు, నీ ఎనర్జీ దొరకడం ఆగిపోతుంది. దానికి సొంతంగా కాళ్లు లేవు, అది నీ కాళ్ల మీదే నడుస్తుంది. నువ్వు ప్రాణం పోస్తేనే దానికి ప్రాణం. నువ్వు జస్ట్ "అబ్జర్వ్" చేసి వదిలేస్తే, అది అక్కడికక్కడే చచ్చిపోతుంది.
3. Rear View Mirror లో చూస్తూ డ్రైవింగ్: ఆత్మవంచనలో పరాకాష్ట
ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకుందాం. మీరు రోడ్డు మీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు పరధ్యానంలో ఉన్నారు. ఎదురుగా ఒక లారీ (Truck) వేగంగా దూసుకువస్తోంది. మీరు సడెన్ గా దాన్ని చూశారు, పక్కకు తప్పుకున్నారు, ప్రాణాపాయం తప్పింది. ఆ లారీ వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ముందుకు చూసుకుంటూ డ్రైవ్ చేయాలి.
కానీ మనసు ఏం చేస్తుందో తెలుసా? "అయ్యో! నేను ఎంత ఘోరమైన తప్పు చేశాను. నేను పరధ్యానంలో ఉన్నాను. ఆ లారీ నన్ను గుద్దేసి ఉంటే నేను చచ్చిపోయేవాడిని కదా! నా కుటుంబం ఏమైపోయేది? నేను ఎంత ఇడియట్ ని!" అంటూ గిల్ట్ ఫీల్ అవుతూ, ఆ వెళ్ళిపోయిన లారీ గురించి ఆలోచిస్తూ, రియర్ వ్యూ మిర్రర్ (Rear-view mirror) లో దాన్ని తదేకంగా చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటుంది. మీరు గతంలో చేసిన తప్పును విశ్లేషిస్తూ, "నేను నా తప్పు నుండి పాఠం నేర్చుకున్నాను" అని ప్రగల్భాలు పలుకుతూ వెనక్కి తిరిగి చూస్తుంటారు.
సరిగ్గా అప్పుడే ఎదురుగా ఇంకో లారీ వస్తుంది. ఢమాల్!
మాయ (Maya) అనేది ఒకే బాణాన్ని రెండుసార్లు ఎయ్యదు. దాని దగ్గర అనంతమైన ఆయుధాలు ఉన్నాయి. మీకు ఏం అనిపిస్తుందంటే, "నేను ఒక తప్పు చేశాను, ఇక జీవితంలో ఆ తప్పు చేయను" అని మీరు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నామని ఫీల్ అవుతారు. మోటివేషనల్ క్లాసుల్లో వినే చెత్త ఇదే - "తప్పులు చేయండి, కానీ ఒకే తప్పును రెండుసార్లు చేయకండి". ఇది వినడానికి భలే క్యూట్ గా ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే, జీవితం మీకు ఒకే తప్పును రెండుసార్లు చేసే అవకాశమే ఇవ్వదు. మీరు చేసే ప్రతి తప్పు కొత్తదే!
మీ అతి పెద్ద బలహీనత మీకు తెలిసిపోయింది కదా, ఇక దాన్ని పట్టుకొని వేలాడకండి. దాన్ని "నిర్దాక్షిణ్యంగా" (Ruthlessly) వెదిలేయండి. మీ అహంకారం ఎంత నొచ్చుకున్నా సరే, ఆ పాత తప్పును మర్చిపోయి తీరాలి. ఎందుకంటే దాన్ని పట్టుకొని కూర్చుంటే, రేపు ఎదురుగా రాబోయే కొత్త ప్రమాదాన్ని మీరు చూడలేరు. మీరు ఇంకా బతికే ఉన్నారంటే, ఇంకో కొత్త తప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లే!
4. రోగి - వైద్యుడు: మన అజ్ఞానం ఏ స్థాయిలో ఉందంటే...
మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అని చాలా తాపత్రయ పడతాం, కానీ అసలు మన గురించి మనకు ఏం తెలుసు? ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? "డాక్టర్ గారు, నాకు తలనొప్పిగా ఉంది, జ్వరం వస్తోంది" అని చెప్తాడు. అంతే కానీ, "నాలో పలానా ఆర్.ఎన్.ఏ (RNA) స్ట్రక్చర్ ఉన్న వైరస్ దూరింది" అని చెప్పలేడు కదా! ఆ వైరస్ వాడి లోపలే ఉంటుంది, కానీ వాడికి తెలిసినదల్లా కేవలం దాని తాలూకు లక్షణం అయిన "తలనొప్పి" మాత్రమే. డాక్టర్ ఆ వైరస్ యొక్క రసాయన నిర్మాణాన్ని విశ్లేషించి మందు ఇస్తాడు.
భౌతికమైన శరీరంలోని వైరస్ గురించే మనకు ఏమీ తెలియనప్పుడు, ఇక అత్యంత సంక్లిష్టమైన మన అంతరంగ ప్రపంచం గురించి మనకేం తెలుసు? మనకు మన బాధ (కష్టాలు, దుఃఖం, కోపం) మాత్రమే తెలుసు. ఆ బాధకు మూలమైన "నేను" (అహం) అనే వైరస్ గురించి మనకు కనీస అవగాహన లేదు.
అందుకే మన సమాజం ఎప్పుడూ లక్షణాల (Symptoms) మీద పోరాడుతుంది కానీ, మూలకారణం (Root cause) దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే మూలాన్ని చూడాలంటే ఒక రకమైన క్రూరత్వం (Ruthlessness) కావాలి. తనను తాను చీల్చి చెండాడే ధైర్యం కావాలి. "నా ఉనికి నాశనం అయినా పర్లేదు, నాకు సత్యం తెలియాలి" అనే తెగింపు కావాలి. మీలో ఆ పదును లేదు. మీ ప్రశ్నలు కూడా పైపైన స్పర్శించి ఆగిపోతాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనే యావలో సత్యాన్ని బలిచేస్తుంటారు.
5. "అంతా తెలిశాక ఏం చేయాలి?" - ఇదొక మూర్ఖపు ప్రశ్న
సరిగ్గా ఇక్కడే అందరూ అడ్డంగా బుక్కవుతారు. విషయాలన్నీ విన్నాక, "సరే గురువు గారు, నేను అన్నీ చూస్తున్నాను, గమనిస్తున్నాను. ఇప్పుడు నన్ను మారడానికి ఏదైనా ఒక 'విధానం' (Method) చెప్పండి. ప్రాసెస్ ఏంటి?" అని అడుగుతారు.
ఇది ఎంత మూర్ఖమైన ప్రశ్న అంటే... మీరు మీ గదిలో పడుకున్నారు. సడెన్ గా కిచెన్ లోంచి వంటగ్యాస్ (LPG) లీక్ అవుతున్న తీవ్రమైన వాసన మీ ముక్కుకు తగిలింది. అప్పుడు మీరు మంచం మీద పడుకొనే ఉండి, "గ్యాస్ లీక్ అవుతోంది అని నాకు తెలిసింది. ఇప్పుడు దీన్నుండి బయటపడటానికి 5-స్టెప్స్ మెథడ్ ఏదైనా ఉంటే చెప్పండి" అని గూగుల్ లో వెతుకుతారా? లేదు! స్ప్రింగ్ లాగా ఎగిరి గంతేసి బయటకు పరిగెడతారు.
చూశారా? భౌతికమైన ప్రమాదం ఎదురైనప్పుడు "తెలుసుకోవడం" (Knowing) అనేది తక్షణమే "చర్య" (Action) గా మారిపోయింది. దానికి ఏ పద్ధతులు, ట్యుటోరియల్స్ అవసరం లేదు. కేవలం "గ్యాస్ వాసన" అనే ఒక చిల్లర జ్ఞానానికే మీరు అంత వేగంగా స్పందించినప్పుడు, అత్యున్నతమైన ఆత్మిక జ్ఞానం (Spiritual truth) మీకు తెలిస్తే ఇంకెంత వేగంగా జీవితం మారాలి?
కానీ మారదు! ఎందుకంటే, గ్యాస్ వాసన మీకు స్పష్టంగా తెలిసింది, కానీ మీ బుర్రలో ఉన్న చెత్తను మీరు స్పష్టంగా చూడట్లేదు. మీ "తెలుసుకోవడం" లో నిజాయితీ లేదు. ఒకవేళ మీరు నిజంగా సత్యాన్ని పూర్తి నగ్నంగా చూసి ఉంటే, ఏ నిర్ణయాలు, ఏ నిశ్చయాలు, ఏ పద్ధతులు లేకుండానే సరైన కర్మ (Right Action) దానంతట అదే జరిగిపోతుంది.
స్వేచ్ఛ అనేది ఎంచుకోవడంలో లేదు, తెలుసుకోవడంలో ఉంది!
చివరిగా ఒక అత్యంత సూక్ష్మమైన సత్యాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఎన్నో వేవ్స్ వస్తుంటాయి. మంచివి, చెడ్డవి, పాశవికమైనవి, జాలి కలిగించేవి. అవన్నీ కేవలం రసాయనిక (Chemical), జీవసంబంధమైన (Biological) ప్రతిచర్యలు మాత్రమే. అవి "నీవి" కావు, "మనసువి" మాత్రమే.
వీటిని అణిచివేయడం నీ పని కాదు. అలాగే ప్రతి ఆలోచనను ఆచరణలో పెట్టేయడం (Execution) కూడా నీ పని కాదు. నీ పని అల్లా ఒకటే - గమనించడం (To Observe).
ఈ గమనించే క్రమంలో, కొన్నిసార్లు ఆ చెత్త ఆలోచనలకే నువ్వు తలొగ్గాల్సి రావచ్చు. అది కూడా నేరం కాదు. తెలుసుకోకుండా గుడ్డిగా చేయడమే నేరం. నువ్వు కళ్లు తెరిచి, పూర్తి ఎరుకతో ఒక తప్పు దారిలో నడిచినా సరే, అది మంచిదే. ఎందుకంటే ఆ ఎరుక (Awareness) అనేది ఏదో ఒక క్షణంలో నిన్ను ఆటోమేటిక్ గా సరైన దారిలోకి లాగుతుంది.
కానీ జాగ్రత్త... "నేను ఎరుకతోనే ఈ తప్పు చేస్తున్నాను కదా" అని నీ అహంకారం మళ్ళీ నిన్ను మోసం చేయడానికి చూస్తుంది. మనం చాలా కన్నింగ్, మాయ చేసే భయంకరమైన వ్యక్తులం సుమా! మనల్ని మనం మోసం చేసుకోవడంలో మనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. కాబట్టి నువ్వు "తెలుసుకుంటున్నాను" అనుకుంటున్నావే.. ఆ తెలుసుకోవడాన్ని కూడా అనుమానించు. దాన్ని కూడా ఒక డేగ కన్నుతో చూస్తూ ఉండు.
- PRATIKULA VEDAM
Comments
Post a Comment