నీ విజయానికి పునాది ఎవరు? Self-Made అనే అబద్ధం
నీ విజయానికి పునాది ఎవరు? నీకు తెలుసు. పేరు చెప్పడానికి నీ ఇగో ఒప్పుకోకపోవచ్చు, కానీ నీకు తెలుసు.
నువ్వు మెట్లు ఎక్కుతున్నప్పుడు, నీకోసం నిశ్శబ్దంగా వెనక్కి తగ్గిన ఆ మనిషి ఎవరో నీకు తెలుసు. నీ కలల కోసం తమ ఆశలను పక్కన పెట్టినవాళ్ళు, నీ "రేపు" కోసం తమ "ఈ రోజు" ని బలి చేసినవాళ్లు. దాన్ని నువ్వు చాలా సౌకర్యంగా "sacrifice" అని పిలుస్తుంటావ్. కానీ అక్కడే నువ్వు నీ మొదటి అబద్ధం ఆడావు.
Sacrifice అంటే అవతలి వ్యక్తి తన ఇష్టపూర్వకంగా ఇవ్వడం. వాళ్ళకి వేరే దారి లేక ఇచ్చారో, లేదా గుడ్డిగా ఇచ్చారో పక్కన పెడితే... నువ్వు మాత్రం దాన్ని నీ హక్కుగా తీసుకున్నావు. ఆ చిన్న తేడాలోనే నీ అసలు స్వభావం దాగుంది.
"Self-Made" — సమాజం నిర్మించిన ఒక అందమైన మోసం
ఆ హక్కుతోనే, ఇప్పుడు నీ LinkedIn ప్రొఫైల్ తెరిచి "Self-Made" అని గర్వంగా రాసుకున్నావు. కానీ ఒక్క క్షణం ఆగు. నిజంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీకు మొదటి అవకాశం ఇచ్చింది ఎవరు? నీ failures ని భరించి, నువ్వు కింద పడ్డప్పుడు పట్టుకుంది ఎవరు? నువ్వు తప్పు చేసినప్పుడు "పర్వాలేదు, మళ్ళీ try చేయి" అని వెన్ను తట్టింది ఎవరు? వాళ్ళ పేర్లు నీ ప్రొఫైల్ లో ఎక్కడా ఉండవు. అయినా సరే నువ్వు "Self-Made".
ఇది కేవలం నీ అహంకారం కాదు, ఈ society నిర్మించిన ఒక అందమైన మోసం. ఒక వ్యక్తి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు అనగానే, అతని కష్టం, టాలెంట్ గురించి మాత్రమే లోకం మాట్లాడుతుంది. అతని వెనుక నిశ్శబ్దంగా కరిగిపోయిన మనుషుల గురించి ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే, ఆ నిజం చెప్తే hero కి ఉండే halo పోతుంది.
"సక్సెస్ అయిన వాడిని చూసి స్ఫూర్తి పొందు" అని society చెప్తుంది కానీ, "ఆ సక్సెస్ కింద ఎవరి జీవితం నలిగిపోయింది, ఎందరి జీవితాలు నలిగిపోయాయి?" అని ఏ motivational speaker అడగడు.
ఆ ప్రశ్న అడిగితే audience రారు, ఆ content కి views రావు. ఎందుకంటే, నొప్పి కలిగించే నిజం ఎప్పుడూ అమ్ముడుపోదు.
త్యాగం (Sacrifice) వెనుక ఉన్న Entitlement
ఇప్పుడు నిన్ను మరింత ఇబ్బంది పెట్టే ఒక చీకటి కోణంలోకి తీసుకెళ్తాను. నీ కోసం ఒకరు తమ career ని వదులుకున్నప్పుడు, నీ మనసులో ఏమనిపించింది? "పాపం" అనిపించిందా? బయటికి అది compassion లా అనిపించవచ్చు. కానీ నీ subconscious లోపల "నాలో ఆ స్పార్క్ ఉంది కాబట్టే కదా వాళ్ళు నాకోసం అంత త్యాగం చేశారు" అనే ఒక superior ఫీలింగ్ రాలేదా?
కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒకరు నీ కోసం బలి అవ్వడాన్ని, నీ talent కి దక్కిన గౌరవంగా ఫీల్ అవ్వడం నీలో ఉన్న అతి పెద్ద blind spot. ఇప్పుడు నిజాయితీగా చెప్పు.. వాళ్ళు ఆ త్యాగం చేయకపోయి ఉంటే, నువ్వు వాళ్ళని అంతే ప్రేమిస్తూ, అంతే గౌరవిస్తూ ఉండేవాడివా?
ఈ ప్రశ్నకి వెంటనే "అవును" అని సమాధానం వస్తే, నువ్వు ఇంకా నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు. నిజమైన సమాధానం కోసం వెతకడానికి నీకు పట్టే ఆ సమయమే — నీలోని అసలు స్వభావానికి సాక్షి.
బంధాలకు "Pause" బటన్ ఉంటుందా?
ఈ స్వార్థంతోనే మనిషి ఇంకో పెద్ద మోసం చేస్తాడు. మనుషుల్ని, బంధాల్ని ఒక "pause" లో పెట్టి వెళ్ళిపోవడం. "నా లక్ష్యం నెరవేరాక తిరిగి వస్తాను" అని చాలా mature గా, responsible గా చెప్తాడు. కానీ life అనే game లో pause button ఉండదు. నువ్వు నీ ఆశయాల కోసం పరిగెడుతున్నప్పుడు, అవతలి మనిషి జీవితం ఆగిపోదు. వాళ్ళ ఒంటరితనం pause అవ్వదు. వాళ్ళ బాధ మీద "loading..." icon రాదు.
తీరా నువ్వు సక్సెస్ అయ్యాక తిరిగి వచ్చి, వాళ్ళు ఇంకా నీ కోసం wait చేస్తూ ఉండాలి అని expect చేస్తావు. ఆ వెయిటింగ్ ని "మన బంధం అంత గొప్పది" అని romanticize చేస్తావు. కానీ అది romance కాదు, అది కేవలం నీ convenience కోసం నువ్వు నిర్మించుకున్న narrative. నీ అవసరాలకు తగ్గట్టు పక్కన పెట్టడానికి, వీలున్నప్పుడు వాడుకోవడానికి మనుషులు వస్తువులు కాదు. కానీ మనం వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తాం,, ప్రేమ అనే ముసుగు వేసి.
ఔదార్యం అనే Expensive Band-aid
సక్సెస్ వచ్చాక, వెనక్కి తిరిగి చూసుకుని కుటుంబానికి సహాయం చేస్తే, దాన్ని society "generosity" అని పొగుడుతుంది. "రూట్స్ మర్చిపోలేదు" అని చప్పట్లు కొడుతుంది. కానీ ఆ ఔదార్యం వెనుక ఉన్న నిజాన్ని పూర్తిగా చూడు.
కుటుంబం కష్టాల్లో ఉన్న ఆ సంవత్సరాలలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నావు. ఆ క్షణంలో నీకు కుటుంబం కన్నా నీ career ముఖ్యం అయింది. అందులో తప్పు లేదు, అది human nature. కానీ ఆ నిజాన్ని అంగీకరించే ధైర్యం నీకు ఉండాలి.
కోట్లు వచ్చాక అప్పులు తీర్చడం అనేది generosity కాదు, belated responsibility. స్పష్టంగా చెప్పాలంటే, అది నీలో ఉన్న guilt ని కవర్ చేసుకోవడానికి నువ్వు అంటించిన ఒక expensive band-aid. Band-aid గాయాన్ని కనపడకుండా దాస్తుంది తప్ప, నయం చేయదు. వాళ్ళు కోల్పోయిన ఆ సంవత్సరాలను ఏ bank balance తిరిగి తీసుకురాలేదు.
Redemption: పాప ప్రక్షాళన లేక స్వార్థమా?
ఇక్కడే అసలు trap ఉంది. "సక్సెస్ సాధించాక తిరిగి ఇచ్చేస్తే చాలు, లెక్క సరిపోతుంది" అని ఈ society మనల్ని నమ్మిస్తుంది. Redemption అనే కాన్సెప్ట్ మీద మనకు విపరీతమైన faith ఉంది. "తప్పు చేశాడు, కానీ తెలుసుకున్నాడు" అనే story structure మనకి చాలా ఇష్టం. కానీ redemption అంటే నిజంగా ఏంటి?
జరిగిన damage ని undo చేయడమా? లేక damage చేసినవాడు better గా feel అవడమా? వాళ్ళు కోల్పోయిన career తిరిగి రాదు, పడ్డ కష్టం erase అవ్వదు. Redemption అనేది తప్పు చేసిన వాడికి closure ఇస్తుంది తప్ప, బాధపడిన వాడి గాయాన్ని మాన్పదు. మనం దాన్ని యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే అది ఒప్పుకుంటే మనం చేసిన damage యొక్క పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అది చాలా heavy.
నీ అసలు Success Story ఏంటి?
ఇప్పుడు చివరగా ఒక పని చేయి.
నీ success story ని మనసులో మొదటి నుండి replay చేయి. అందులో నువ్వు ఎక్కడ hero గా appear అవుతున్నావో ఆ moments ని జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు, ఆ story లోంచి నిన్ను నువ్వు పూర్తిగా తీసేయి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు.
అది నీ అసలు success story.
జీవితం అనే చెస్ బోర్డు మీద నువ్వు రాజువి అయ్యావు అంటే, నీ కోసం ముందు వరుసలో బలి అయిన బంటు తప్పకుండా ఉంటాడు. ఆ నిజాన్ని అంగీకరించడం అంటే కోట్లు దానం చేయడం కాదు, grand gestures చేయడం కాదు. ఆ బంటు పేరు గుర్తు చేసుకోవడం. వాళ్ళు కోల్పోయింది వెనక్కి రాదు అని పూర్తిగా తెలిసినా సరే, "నీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను" అని నిజాయితీగా ఒప్పుకోవడం.
అది చేయగలవా? ఒకవేళ చేయలేకపోతే... అప్పుడు నీ success కి అర్థమేంటి?
-PRATIKULA VEDAM

Comments
Post a Comment