కురుసభలోని ద్రౌపది నుంచి కార్పొరేట్ మహిళ వరకు.. మగాడి కుర్చీ లాక్కోడమే FEMINISM aaa?

చీకటిలో ఉండడం అజ్ఞానం కాదు. ఆ చీకటి తనలోనే ఉందని తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. జైలు గోడలకి రంగులేసినంత మాత్రాన అది ఇల్లు అయిపోదు, సంకెళ్లు మార్చుకున్నంత మాత్రాన స్వేచ్ఛ వచ్చినట్లు కాదు.

మహాభారతంలో ద్రౌపది ఒక మహారాణి. ఆమెకు సమాజంలో అత్యున్నత హోదా ఉంది. ఐదుగురు మహావీరులు ఆమె భర్తలు. అంటే, నేటి పరిభాషలో చెప్పాలంటే ఆమెకు 'External Power' (బాహ్య అధికారం) ఉంది. కానీ కురుసభలో ఆమెను నిలబెట్టినప్పుడు, ఆ సభలో ఉన్న మగాళ్లందరూ (ధర్మరాజుతో సహా) ఆమెను కేవలం ఒక 'దేహంగా', ఒక 'ఆస్తిగా' మాత్రమే చూశారు. అధికారం ఉన్నా, హోదా ఉన్నా, పితృస్వామ్యపు చూపు ఆమెను ఒక వస్తువుగానే లెక్కగట్టింది.

ఈరోజు చట్టసభల్లో కూర్చునే మహిళ అయినా, కార్పొరేట్ బోర్డు రూమ్‌లో కూర్చునే మహిళ అయినా ఎదుర్కొంటున్నది అదే కురుసభను. ఆమె తనకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేదు, మగాడు కట్టిన భవనంలోనే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు మారింది అంతే. ఆట నియమాలు ఇంకా మగాడివే.

గాయం యొక్క అనాటమీ (The Anatomy of the Wound)

Patriarchy (పితృస్వామ్యం) ఒక కల్పిత కథ కాదు. అది అనాదిగా ఉన్న ఒక సామాజిక వాస్తవం. ఋగ్వేదంలో అద్భుతమైన విషయాలు రాసిన స్త్రీలు పుట్టిన ఈ గడ్డ మీదే, "స్త్రీ బాల్యంలో తండ్రికి, యవ్వనంలో భర్తకు, వృద్ధాప్యంలో కొడుకుకు బానిసగా ఉండాలి" అని శాసించిన మనుస్మృతి కూడా పుట్టింది. కేవలం శిఖరాలను మాత్రమే చూసుకుని మురిసిపోతే, లోయల్లో ఉన్న లోతు తెలియదు.

పితృస్వామ్యం ఒక స్త్రీకి చేసే అతి పెద్ద ద్రోహం ఏమిటంటే—ఆమె విలువను కేవలం ఆమె 'దేహానికి' పరిమితం చేయడం. ఆమె శరీర శ్రమ, ఆమె పునరుత్పత్తి సామర్థ్యం, మగాడి ఆనందం కోసం ఆమె దేహం ఎంతవరకు పనికొస్తుంది అనేదే ఆమె కొలబద్ద.

ఈరోజు ఒక ఆధునిక దినపత్రికలోని Matrimony (పెళ్లి సంబంధాల) కాలమ్ తీసి చూడండి. వధువు కావాలి అనే ప్రకటనలో: ఆమె రంగు, ఎత్తు, బరువు, ఇంటి పనుల్లో నేర్పు అడుగుతారు. వరుడు కావాలి అనే ప్రకటనలో: వాడి ఆస్తి, ఉద్యోగం, జీతం అడుగుతారు. ఇక్కడ జరుగుతున్నది ఇద్దరు మనుషుల కలయిక కాదు. ఒక దేహం యొక్క 'Display Value' కి, ఒక కుటుంబం యొక్క 'Economic Position' కి మధ్య జరుగుతున్న ఒక నిస్సిగ్గు వ్యాపారం. డిగ్రీలు చదివిన ఆధునిక కుటుంబాలు కూడా చాలా సిన్సియర్‌గా ఈ వ్యాపారం చేస్తాయి. అంటే, పితృస్వామ్యం పోలేదు, అది Standardize (ప్రమాణీకరించబడింది) చేయబడింది అంతే.

మనువాదం మరియు ఆధునిక మిసోజిని (Internalised Misogyny)

ఒక స్త్రీ గదిలోకి అడుగుపెట్టగానే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఆమెకు ఎవరూ చెప్పనవసరం లేదు, ఏ కళ్ళు తనని ఎలా కొలుస్తున్నాయో ఆమెకు అంతర్గతంగా తెలుసు. ఈ కొలబద్ద ఆమె బయట నుంచి తెచ్చుకోలేదు, ఆమె పుట్టినప్పటి నుంచి సమాజం ఆమె మెదడులో ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్ అది. బయట ప్రపంచం ఆమెను జడ్జ్ చేయడానికి ముందే, ఆమె తనను తాను జడ్జ్ చేసుకుంటుంది.

రీసెంట్‌గా జరిగిన ఒక చర్చలో ఒక మీడియా స్టడీస్ విద్యార్థిని కలిశాను. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ఆమె ఒక 'Loud Feminist'. పురుష పక్షపాత దృష్టి మీద కాలేజీలో గంటలు గంటలు లెక్చర్లు దంచగలదు. కానీ, ఏకాంతంలో అద్దం ముందు నిలబడినప్పుడు, తన బరువు పెరిగిందని ఏడుస్తుంది. తన తోటి స్నేహితురాలితో తన అందాన్ని పోల్చుకుని కుమిలిపోతుంది. తాను ప్రేమించిన అబ్బాయి తన భౌతిక సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడవుతున్నాడా లేదా అని క్షణక్షణం లెక్కలు వేసుకుంటుంది.

దీని అర్థం ఏమిటి? అకడమిక్ సెమినార్లలో ఆమె ఒక స్వేచ్ఛాజీవి. సైకలాజికల్ గా ఆమె ఒక బానిస. ఆమెకు విముక్తికి సంబంధించిన పదజాలం (Vocabulary) తెలుసు, కానీ ఆమె అనుభవిస్తున్నది మాత్రం పంజరాన్నే.

ఇదే అసలైన గాయం. ఎవరైతే సమాజంలో పితృస్వామ్యాన్ని నిలదీస్తున్నారో, వారే తమ ప్రైవేట్ జీవితంలో తమ దేహాన్ని తామే అసహ్యించుకుంటున్నారు. తన ఆత్మగౌరవాన్ని తన బరువుతో కొలుచుకునే స్త్రీ, మగాడి అటెన్షన్ కోసం ఎదురుచూసే స్త్రీ, ఇంకో స్త్రీని అందం విషయంలో కాంపిటీటర్‌గా చూసే స్త్రీ—ఆమె ఏ జెండా పట్టుకున్నా సరే, ఆమె పూర్తి స్థాయిలో ఒక 'Misogynist' (స్త్రీ ద్వేషి).

సమస్య మగాడిలో మాత్రమే లేదు. మగాడి చూపును స్త్రీ తన చూపుగా మార్చుకోవడంలో ఉంది.

వ్యాధిని సమర్థించే చికిత్స: మైత్రేయి అడిగిన ప్రశ్న

ఇక్కడే ఆధునిక ఫెమినిజం ఘోరమైన తప్పు చేస్తోంది. గాయాన్ని సరిగ్గానే గుర్తించినా, అది ఇచ్చే ట్రీట్మెంట్ తప్పు. "వంటగదిలో ఉన్న స్త్రీని ఆఫీసుకు పంపు, ఇంట్లో ఉన్న అధికారాన్ని పార్లమెంటుకు మార్చు" అని చెబుతోంది. లాజిక్ ప్రకారం, బానిస యజమాని అయితే స్వేచ్ఛ వచ్చేస్తుందా?

బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. యాజ్ఞవల్క్యుడు తన ఆస్తిని ఇద్దరు భార్యలకు (మైత్రేయి, కాత్యాయని) పంచి అడవులకు వెళ్లబోతాడు. అప్పుడు మైత్రేయి అడుగుతుంది: "యేనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం?" (ఈ ఆస్తి, ఈ భౌతిక సంపద నాకు అమృతత్వాన్ని (శాశ్వత స్వేచ్ఛను) ఇవ్వలేనప్పుడు, దీనిని నేనెందుకు తీసుకోవాలి?).

మైత్రేయి అడిగింది సమానత్వం కాదు, ఆస్తిలో సగం వాటా కాదు, ఆమె అడిగింది ఉనికికి సంబంధించిన స్వేచ్ఛ. కానీ నేటి ఫెమినిజం అడుగుతున్నది యాజ్ఞవల్క్యుడి ఆస్తిని మాత్రమే. మగాడు శతాబ్దాలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు అదే విధ్వంసం చేసే హక్కు నాకు కూడా కావాలి అని అడగడం ఆశయం కాదు, అది ఒక మూర్ఖపు విన్నపం.

'బాహ్య సమానత్వం' (External Equality) ఎంత డొల్లదో చెప్పడానికి మనకు బయటి దేశాల దాకా వెళ్లక్కర్లేదు. 73, 74వ రాజ్యాంగ సవరణలు వచ్చి ముప్పై ఏళ్లు దాటుతోంది. పంచాయతీల్లో 33% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ మన గ్రామాల్లో ఏం జరుగుతోంది? గెలిచేది మహిళ, కానీ అధికారం చెలాయించేది భర్త (సర్పంచ్-పతి). సీటు మారింది, కానీ మైండ్‌సెట్ మారలేదు.

రువాండా (Rwanda) దేశంలో 61% మహిళా ఎంపీలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికం. కానీ అదే దేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహ హింసకు, లైంగిక దాడులకు గురవుతున్నారు. స్కాండినేవియన్ దేశాలు జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ లో టాప్ లో ఉంటాయి. కానీ అక్కడి యువతుల్లో బాడీ ఇమేజ్ డిజార్డర్స్ (Body image distress) మిగతా ఐరోపా దేశాల కంటే ఏమాత్రం తక్కువ కాదు. సీట్లు మారాయి, కానీ గాయం మారలేదు.

A, B కి సమానం కావాలి అనుకున్నప్పుడు—అసలు A అంటే ఏమిటి? B అంటే ఏమిటి? అని ఎవరూ ప్రశ్నించరు. మగాడు (B) ఇప్పటికే తన అహంకారంతో, అజ్ఞానంతో ఒక భ్రష్ట పట్టిన వ్యవస్థను తయారు చేశాడు. ఇప్పుడు స్త్రీ (A) కూడా ఆ భ్రష్టత్వంలో నాకు సమాన వాటా కావాలి అని పోరాడటం ఎంతవరకు తార్కికం?

నాలుగో దశ ఫెమినిజం: ఎంపిక (Choice) పేరుతో జరుగుతున్న మోసం

"అన్నీ నా ఇష్టమే (My Choice)" అనేది నేటి మోడరన్ ఫెమినిజం నినాదం. భర్తకు సేవ చేయాలనుకోవడం నా ఛాయిస్, అది ఫెమినిజం అంటారు. ఉద్యోగం చేయడం నా ఛాయిస్, అదీ ఫెమినిజం అంటారు. ఒళ్లు కప్పుకోవడం నా ఛాయిస్, ఒళ్లు ప్రదర్శించడం నా ఛాయిస్... అంతా ఫెమినిజమే.

ఇంతకంటే అసంబద్ధమైన లాజిక్ ఇంకొకటి లేదు. ఛాయిస్ గురించి మాట్లాడుతున్నారు సరే, ఆ ఛాయిస్ ఎంచుకుంటున్న ఆ 'నేను' (Ego) ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు దేనినైతే స్వేచ్ఛ అని భ్రమపడుతున్నావో, ఆ స్వేచ్ఛా భావనను నీ బుర్రలో ప్లాంట్ చేసింది ఎవరు? అదే మార్కెట్, అదే పితృస్వామ్యం. ఒక బానిస తనకు ఇష్టమైన సంకెళ్లను తానే కొనుక్కుని, 'నాకు నచ్చిన బ్రాండ్ సంకెళ్లు వేసుకున్నాను, ఇది నా ఛాయిస్' అని మురిసిపోతే ఎలా ఉంటుందో, ఈ 'Choice Feminism' కూడా అలాగే ఉంటుంది.

హక్కులు పెరిగాయి. కానీ వివేకం (Wisdom) పెరగలేదు. ప్రైవేట్ గా తనను తాను ఒక మాంసపు ముద్దగా చూసుకునే స్త్రీకి ఎన్ని హక్కులు ఇచ్చినా, ఆ హక్కులను ఆమె తన అజ్ఞానాన్ని మరింత ప్రదర్శించుకోవడానికే వాడుకుంటుంది తప్ప, విముక్తి కోసం కాదు.

మా ఊర్లో సరస్సు దగ్గర జరిగిన చిన్న సంఘటన

చట్టాలు మార్చలేకపోయిన భయం గురించి చెప్పడానికి మొన్న మా ఊర్లో నేను కళ్లారా చూసిన ఒక సంఘటన చెబుతాను. రాత్రివేళ ఇద్దరు యువతులు సరస్సు పక్కన నడుస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు వాళ్ల వెనకాలే ఫాలో అవుతున్నారు. అకస్మాత్తుగా అందులో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి, కోపంతో కాకుండా చాలా నిర్మలంగా, కళ్ళలోకి చూస్తూ.."ఎంతసేపు అలా వెనకాలే నడుస్తారు? దమ్ముంటే పక్కన నడవండి" అని అడిగింది. ఆ దెబ్బకు ఆ ఆకతాయిలు బిత్తరపోయారు,

ఎందుకు బిత్తరపోయారు? ఎందుకంటే ఆ అమ్మాయి ఒక భౌతిక దేహంగా వాళ్ళతో మాట్లాడలేదు, ఒక స్పష్టమైన చైతన్యంగా (Consciousness) నిలబడి మాట్లాడింది. మెజారిటీ మహిళలు ఏం చేస్తారు? భయంతో వణికిపోతూ, వాళ్ల నీడలోనే నడుస్తారు. సమస్య వెనకాల ఉన్న మగాళ్లతో లేదు, తనను తాను ఒక బలహీనురాలిగా డిఫైన్ చేసుకున్న ఆ స్త్రీ మైండ్‌సెట్‌లో ఉంది.

ఆమె లోపల తనదైన ఒక అస్తిత్వం ఉంటే, ఏ మగాడి చూపు ఆమెను ఏమీ చేయలేడు. మగాడు ఆమె దేహాన్ని మాత్రమే చూడగలడు. కానీ ఆమె కూడా మగాడి కళ్ళతోనే తన దేహాన్ని చూసుకుంటున్నంత కాలం, ఆమెకు స్వేచ్ఛ లేదు.

అసలైన తిరుగుబాటుదారులు: అక్క మహాదేవి!

భారతీయ చరిత్రలో అసలైన మహిళా విముక్తి అంటే ఏమిటో చూపించిన ఇద్దరు మహాత్ములు ఉన్నారు. 14వ శతాబ్దానికి చెందిన కాశ్మీరీ కవయిత్రి లల్లేశ్వరి, 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవయిత్రి అక్క మహాదేవి.

నేటి ఫెమినిస్టుల్లా వాళ్ళు రోడ్లెక్కి నినాదాలు చేయలేదు. పార్లమెంటులో రిజర్వేషన్లు అడగలేదు. అక్క మహాదేవి తన మీద బలవంతంగా రుద్దబడిన వివాహాన్ని, రాజభోగాలను గడ్డిపోచలా విసిరేసి నగ్నంగా బయటకు నడిచింది. ఆమె దేహాన్ని వస్త్రాలు కాదు కదా, సమాజం యొక్క అంచనాలు, మగాడి చూపులు కూడా తాకలేకపోయాయి.

వారు బట్టలు వేసుకున్నారా లేదా అనేది ఇక్కడ పాయింట్ కాదు. 'దేహం అనేది నా ఉనికి కాదు' అని వారు బలంగా నమ్మారు. ప్రపంచం వాళ్ళను ఏమనుకుంటుంది అనే లెక్కల నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడ్డారు. ఒకరు తమకు తామే మునిగిపోతున్నపుడు, వాళ్ళు పక్కవాళ్ళనెలా కాపాడగలరు? ముందు తాను ఒడ్డుకు చేరాలి. అక్క మహాదేవి లాంటి స్త్రీలు ఒడ్డుకు చేరిన వారు కాబట్టే, వారు పలికిన మాటలు 900 ఏళ్ల తర్వాత కూడా జీవించి ఉన్నాయి.

అది ఫెమినిజం కాదు, అది యాంటీ-ఫెమినిజం కూడా కాదు. ఆ రెండింటికీ అతీతమైన ఒక లోతైన ప్రయాణం అది.

So.. నారీవాదం కాదు, చేతనావాదం కావాలి

లల్లేశ్వరి, అక్క మహాదేవి లాంటి వాళ్ళను 'నారీవాదులు' (Feminists) అనలేం. వారిని 'చేతనావాదులు' (Oriented toward self-inquiry) అనాలి.

ఫెమినిజం ఎక్కడ ఆగిపోతుందో, అక్కడి నుంచి అసలైన పని మొదలవుతుంది. జెండర్ (Gender) ఐడెంటిటీ మీద నిర్మించబడిన ఏ ఉద్యమమైనా, ఆ ఐడెంటిటీని దాటి ఆలోచించలేదు. "నేను ఒక స్త్రీని" అనే దేహ భావన నుంచి పుట్టిన పోరాటం, ఆ దేహ భావన చుట్టూనే ఎప్పటికీ తిరుగుతూ ఉంటది.

నిజమైన స్వేచ్ఛ అనేది హారిజాంటల్ (Horizontal) గా ఒక కుర్చీ నుంచి ఇంకో కుర్చీకి మారడం కాదు. అది వర్టికల్ (Vertical) గా పైకి ఎదగడం. "నా సామాజిక హోదానే నా ఉనికి" అనే భ్రమ నుంచి బయటపడటం. ఇది ఏ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలోనూ దొరకదు, ఏ ఉద్యమాల ఎజెండాలలోనూ ఇమడదు.

  • సమాజం సృష్టించిన మొదటి స్త్రీ—అందరి మెప్పు కోసం ప్రాకులాడే ఒక బొమ్మ.
  • ఫెమినిజం సృష్టించిన రెండవ స్త్రీ—ఆ మొదటి స్త్రీ మీద తిరుగుబాటు పేరుతో, పంజరాన్ని తన మనసులోనే మోస్తున్న ఒక సైద్ధాంతిక బానిస.

ఈ ఇద్దరూ ఇంకా అసలైన విముక్తిని సాధించలేదు. ఆ విముక్తి పార్లమెంటులో పాస్ అయ్యే బిల్లుల వల్ల రాదు. అద్దం ముందు నిలబడినప్పుడు, దేహం వెనక ఉన్న అసలైన "నేను" (Self) ఎవరు అని తనను తాను ప్రశ్నించుకున్న రోజున మాత్రమే వస్తుంది.

మళ్లీ చెబుతున్నాను... చీకటిని తిట్టడం ఆపి, మీలో ఉన్న వెలుగును వెతకండి.

Comments

Popular posts from this blog

మీరు బతుకుతున్నారా, లేక Normal అనే నాటకంలో గొర్రెలా నటిస్తున్నారా? పిచ్చివాళ్ల సమాజంలో Normal గా బతకడమే అతిపెద్ద పిచ్చి!

నీ జీవితంలో ఉన్నవి Problems కావు, నీ చిల్లర కోరికలు.

బానిసత్వానికి నువ్వు పెట్టుకున్న ముద్దుపేరు "బాధ్యత".