IPL అంటే ఆట కాదు — నీ మానసిక దరిద్రాన్ని అమ్ముకుంటున్న వ్యాపారం
మనిషి ఎదుర్కొనే అతి పెద్ద భయం మరణం కాదు... ఒక గదిలో, ఎలాంటి పరధ్యానం లేకుండా, తనతో తాను ఒంటరిగా, నిశ్శబ్దంగా గడపాల్సి రావడం. అకారణమైన, అంతుచిక్కని ఒక అసంతృప్తి ఎప్పుడూ మనిషిని తొలుస్తూనే ఉంటుంది. నిద్రపోతే తీరిపోయే అలసట కాదది. ఎన్ని సాధించినా, ఇంకేదో కావాలనే ఒక ఆరాటం. పైకి అన్నీ ఉన్నట్టు కనిపించినా, లోపల ఎక్కడో ఒక మూల 'నేను అసంపూర్ణం' అనే ఒక భయంకరమైన వెలితి.
ఈ వెలితి ఒక రహస్యం కాదు. ఇది అహంకారం (Ego) యొక్క ప్రాథమిక నిర్మాణం. అహంకారం ఎప్పుడూ తనను తాను సంపూర్ణమైనదిగా భ్రమింపజేసుకుంటుంది. కానీ తనతో తాను ఒంటరిగా కూర్చుంటే, ఆ భ్రమ బట్టబయలు అవుతుంది. అందుకే, అహంకారం ఎప్పుడూ తనను తాను చూసుకోకుండా పారిపోవాలి. పారిపోవడానికి ఒక గమ్యం కావాలి. ఆ గమ్యమే... ఈ 'వినోదం'.
ఆ అశాంతిని, ఆ శూన్యతను కప్పిపుచ్చుకోవడానికి మనిషి ఎప్పుడూ బయటి వస్తువుల మీద ఆధారపడతాడు. విజయం, ఆమోదం, మతం, కులం, లేదా ఒక గుంపు. వీటన్నింటిలో అత్యంత సులువైన, ఎలాంటి శ్రమ అవసరం లేని ఒక మత్తుమందు... "అరువు తెచ్చుకున్న గుర్తింపు" (Borrowed Identity). నువ్వు ఒక గుంపులో చేరిపోతావు, ఆ గుంపు నీకు ఒక గుర్తింపును, ఒక శత్రువును, ఒక ఉనికిని ఇస్తుంది. దీని కోసం నువ్వు నీ లోపల ఎలాంటి మార్పు తెచ్చుకోనవసరం లేదు.
పంతొమ్మిది సీజన్లుగా, దాదాపు 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగిన IPL క్రికెట్, కేవలం ఒక క్రీడ కాదు. దాని ఆర్థిక లెక్కలు, ఆటతీరు గురించి ఎంతో మంది విశ్లేషించారు. కానీ మనం అడగాల్సిన అసలైన ప్రశ్న గ్రౌండ్ లో ఆడుతున్న ఆటగాడి గురించి కాదు, Screen ముందు కూర్చుని తన జీవితాన్ని తగలేసుకుంటున్న ప్రేక్షక మహాశయుడి గురించి. వాడికి ఆ ఆట ఎందుకు అంత అవసరం? ఆ ఫ్రాంచైజీ వాడికి ఏమి ఇస్తోంది? ఒకవేళ ఆ ఆటే లేకపోతే, వాడు తనలోని ఏ భయంకరమైన శూన్యతను ఎదుర్కోవాల్సి వస్తుంది?
మాయా లేడి వెనుక పరుగు: నువ్వు ఎప్పుడూ చేరని ఫ్రాంచైజీ
ప్రతీ సీజన్ లో లక్షలాది మందికి, వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని, వాళ్ళు కనీసం ఒక్క షేర్ కూడా కొనని, వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా కలవని ఆటగాళ్లు ఉన్న ఒక ఫ్రాంచైజీ మీద ప్రాణప్రదమైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఇది రామాయణంలో సీతమ్మ వారు మాయా లేడిని చూసి మురిసిపోయిన క్షణం లాంటిది. పచ్చటి అడవిలో, ప్రశాంతమైన జీవితంలో... ఆ బంగారు లేడి అవసరం ఏముంది? దాని జిలుగులు, దాని తళుకులు మనసును లాగుతాయి. నిజానికి అది లేడి కాదు, మారీచుడు. ఒక భ్రమ. నిన్ను నీ అసలైన అస్తిత్వం (నీ జీవితం) నుంచి దూరం చేయడానికి వచ్చిన ఎర.
నీ ఈ క్రికెట్ ఫ్రాంచైజీ ప్రేమ కూడా సరిగ్గా అలాంటి భ్రమే. ఎవరో కార్పొరేట్ వ్యాపారవేత్తలు కొనుక్కున్న ఒక టీమ్ ఓడిపోతే, నువ్వు ఎందుకు గాయపడినట్లు ఫీల్ అవుతున్నావు? వాళ్ళ విజయాలను నీ వ్యక్తిగత విజయాలుగా ఎందుకు గుండెలకి హత్తుకుంటున్నావు? ఇదంతా కేవలం జాగ్రఫీ (భౌగోళిక ప్రాంతం), నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఒత్తిడి, లేదా రోడ్డు మీద కనిపించే బిల్‌బోర్డ్‌ల మీద ఉండే ఒక ఆటగాడి ముఖం వల్ల అరువు తెచ్చుకున్న ఒక కృత్రిమ ప్రేమ. కానీ అది బయటపడే విధానం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఎంతో కష్టపడి సాధించిన నిజమైన బంధం లాగా, ప్రత్యర్థి జట్టు అభిమానుల మీద ద్వేషం చిమ్మే స్థాయికి ఈ భ్రమ చేరుకుంటుంది.
స్టేడియం బయట ఇద్దరు యువకులు కొట్టుకుంటారు. వాళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు, వాళ్ళ మధ్య ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు, ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. కానీ ఒకడు వేసుకున్న చొక్కా రంగు వేరు కాబట్టి, వాడిని కొట్టాలి. ఇది క్రికెట్ అభిమానం కాదు... అరువు తెచ్చుకున్న ఒక కృత్రిమ గుర్తింపు మనిషిని ఎంత గుడ్డివాడిగా మారుస్తుందో చెప్పే ఒక నగ్న సత్యం.
అహంకారం బతకాలంటే దానికి వస్తువులు కావాలి. శూన్యం మీద అది బతకలేడు. అందుకే ఫ్రాంచైజీ అనేది, దానికి దొరికిన అద్భుతమైన వస్తువు. దాన్ని ప్రేమించడానికి నువ్వు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు, ఏ త్యాగాలు చేయక్కర్లేదు. కేవలం ఆ రంగుల జెర్సీ వేసుకుంటే చాలు... ఈ ప్రపంచం రెండుగా విడిపోతుంది. నీ వైపు ఉన్నవాడు, నీకు వ్యతిరేకంగా ఉన్నవాడు.
"తన టీమ్ ని ఎందుకు ప్రేమిస్తున్నాడో చెప్పలేని వాడు, పక్క టీమ్ ని ప్రేమించే వాడిని చూసి అసహ్యించుకుంటాడు. వాడు మూర్ఖంగా ప్రవర్తించడం లేదు, అహంకారం అనాదిగా ఎలా ప్రవర్తిస్తుందో సరిగ్గా అలాగే ప్రవర్తిస్తున్నాడు."
"నీకో వేషం ఇచ్చాం, నువ్వు ఇది" అని అహంకారానికి చెబితే అది చేసే పని ఇదే. కులం, మతం, ప్రాంతం, రాజకీయం... ఇవన్నీ అహంకారం వాడుకునే పనిముట్లే. ఆ పనిముట్లు లేకుండా ఒంటరిగా నిలబడి తనను తాను చూసుకోవడం అహంకారానికి ఇష్టం ఉండదు. ఫ్రాంచైజీ క్రికెట్ అనేది, ప్రతి సంవత్సరం రెండు నెలల పాటు, ఆ అహంకారానికి ఎలాంటి ప్రమాదం లేకుండా దొరికే ఒక సురక్షితమైన మత్తు.
బ్రెడ్ అండ్ సర్కస్: నీ మానసిక దరిద్రం ఖరీదు ఎంత?
ఒక కఠోర సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తా విను. మనిషి అంతరంగం ఎంత దరిద్రంగా ఉంటే, వాడికి వినోదం అంత చవకగా, అంత అద్భుతంగా కావాల్సొస్తది. ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో ఒక విధానం ఉండేది. దాన్ని "Panem et Circenses" (Bread and Circuses) అనేవాళ్ళు. రోమ్ నగరంలో రాజకీయ నాయకులు, పాలకులు అవినీతిలో కూరుకుపోయి, ప్రజల జీవితాలు నాశనం అవుతున్నప్పుడు... ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉండటానికి చక్రవర్తులు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ప్రజలకు ఉచితంగా గోధుమలు ఇచ్చి, కొలోసియం (Colosseum) అనే పెద్ద స్టేడియంలో గ్లాడియేటర్ల పోరాటాలు, రక్తపాతం ఉచితంగా చూపించేవాళ్ళు. ఆ వినోదంలో, ఆ అరుపుల్లో పడి ప్రజలు తమ అసలైన బానిసత్వాన్ని, దారిద్ర్యాన్ని మర్చిపోయేవాళ్ళు.
నేటి IPL సరిగ్గా ఆధునిక కొలోసియం. ఎందుకంటే, నీ జీవితంలో లోతైన ప్రేమ లేదు, నిన్ను ఎంగేజ్ చేసే అర్థవంతమైన పని లేదు. అందుకే సాయంత్రం అయ్యేసరికి ఆ మ్యాచ్ ఒక ఆనందాన్ని ఇచ్చే ఆట కాదు, నీ బాధను మర్చిపోవడానికి నువ్వు వేసుకునే ఒక అనస్థీషియా (Anaesthesia).
ఒక మనిషి పదే పదే ఎలాంటి వినోదం వైపు పరుగులు తీస్తున్నాడన్నది, వాడి బ్యాంక్ బ్యాలెన్స్, వాడి చదువు కంటే వాడి అంతర్గత పరిస్థితిని స్పష్టంగా చూపిస్తుంది. నిజమైన జీవితం ఉన్నవాడు, తన పనిని తాను ప్రేమించేవాడు కూడా క్రికెట్ చూస్తాడు. కానీ వాడికి ఆ మ్యాచ్ జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఒక బాల్ కి సిక్స్ పడినా, వికెట్ పడినా ఆ క్షణానికి ఆనందిస్తాడు, మరుసటి క్షణం తన పనుల్లో తాను ఉంటాడు. కానీ, స్క్రీన్ కింద మారే బెట్టింగ్ రేట్లు, ప్రతి బౌండరీకి పేలే పటాకులు, ఏమాత్రం సంబంధం లేకుండా ఎగిరి గంతేసే చీర్‌లీడర్లు... ఇవేవీ వాడికి అవసరం లేదు. ఎందుకంటే వాడు తన లోపలి సంపూర్ణత్వం నుంచి ఆటను చూస్తున్నాడు. కానీ నువ్వు? నీ జీవితంలో ఆ రెండు నెలల క్రికెట్ సీజన్ తీసేస్తే, మిగిలిన నీ సంవత్సరం అంతా ఒక శూన్యం.
ఒకప్పుడు క్రికెట్ అంటే ఒక నిరీక్షణ. రోజంతా క్రీజులో పాతుకుపోయి ఆడే బ్యాట్స్మెన్ కు, బంతిని గాల్లో తిప్పుతూ ఊరించే స్పిన్నర్ కు మధ్య జరిగే ఒక మానసిక యుద్ధం. అది టెస్ట్ క్రికెట్. అది ఆటగాడిలో ఒక సహనాన్ని, ఒక స్థిరత్వాన్ని పరీక్షించేది. ఇప్పుడు ఆ స్థిరత్వాన్ని ఇంకో గొప్ప లక్షణంతో భర్తీ చేయలేదు, కేవలం "గోల" తో భర్తీ చేశారు.
ఒక మంచి పుస్తకం చదివినప్పుడు, లేదా ఒక అద్భుతమైన కళను చూసినప్పుడు నీ లోపల ఒక మార్పు వస్తుంది. నువ్వు ఆ అనుభవం ముందు ఎలా ఉన్నావో, ఆ అనుభవం తర్వాత అలా ఉండవు. నీలో ఏదో ఒక ఎదుగుదల వస్తుంది. కానీ ఈ తక్షణ విరామమివ్వని ఉత్తేజం (Stimulation without depth) నిన్ను ఎక్కడికీ తీసుకువెళ్ళదు. అది నీ అటెన్షన్ ను లాగేసుకుంటుందే తప్ప, నీకు ఏమీ ఇవ్వదు. ఆ క్షణం ముగియగానే, నీకు "ఇంకా కావాలి" అనే ఒక వ్యసనాన్ని మాత్రమే మిగులుస్తుంది.
అందుకే అహంకారానికి ఎప్పుడూ డోస్ పెంచుతూ పోవాలి. ఆగస్టు 2025 లో ప్రభుత్వం ఫాంటసీ స్పోర్ట్స్, రమ్మీ, పోకర్ లాంటి ఆన్‌లైన్ మనీ గేమ్‌లను నిషేధించే సమయానికి... ఒక్క డ్రీమ్ 11 లోనే 22 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. చట్టబద్ధమైన గేమింగ్ ఇండస్ట్రీ ఏటా ₹30,000 కోట్ల వ్యాపారంగా మారింది. నిజమైన ఆనందం ఎప్పుడో చచ్చిపోయింది... దాని స్థానంలో అశాంతి, ఆందోళన వచ్చి చేరాయి. గ్రౌండ్ లో అరుపులు ఆనందానికి కాదు, వ్యసనానికి సంకేతం.
శకుని మాయ జూదం: డిస్ట్రాక్షన్ ఎకానమీ & హీరో వర్షిప్
మహాభారతంలో ద్యూత పర్వం గుర్తు తెచ్చుకో. ధర్మరాజు జూదం అనే వ్యసనం పట్టుకోగానే తన రాజ్యాన్ని, చివరకు భార్యను కూడా పందెం కాసి ఓడిపోయాడు. ఇక్కడ ఈ ఫ్రాంచైజీ ఓనర్లు, బెట్టింగ్ యాప్ల యజమానులు, మరెవరో కాదు. ఆధునిక శకునులు. వాళ్ళకి తెలుసు ఏ బంతికి ఎంత వ్యసనాన్ని పంప్ చేయాలో. నీ సమయాన్ని వాళ్ళు దోచుకోలేదు. నువ్వే నీ చేతులారా ప్రతీ సాయంత్రం నీ జీవితాన్ని వాళ్ళ పాదాల దగ్గర పెడ్తున్నావ్. నువ్వు నీ నిజమైన జీవితాన్ని తగలేసుకుంటుంటే, వాళ్ళు ప్రైవేట్ జెట్లు కొనుక్కుంటున్నారు.
ఈ వ్యాపారం లెక్కలు చూస్తే నీకు పిచ్చెక్కుతుంది. ప్రస్తుత IPL బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ₹48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. టీవీలో 10 సెకన్ల యాడ్ ఇవ్వాలంటే ₹18 లక్షలు. ఇండియాలో జరిగే మొత్తం స్పోర్ట్స్ అడ్వర్టైజింగ్ లో 87% ఒక్క క్రికెట్ కే వెళుతుంది. ఇక్కడ మ్యాచ్ అనేది కేవలం ఒక నెపం... అక్కడమ్ముడుపోతున్న అసలు ప్రోడక్ట్, "ఆట కాదు." "నువ్వే."
నువ్వు దేవుళ్ళుగా కొలిచే హీరోలు (రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్, పంత్ లాంటి వాళ్ళు) నేరుగా ఆ ఫాంటసీ బెట్టింగ్ యాప్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా చేశారు. పార్లమెంట్ దేన్నైతే సమాజానికి క్యాన్సర్ లాంటిది అని నిషేధించిందో, అదే క్యాన్సర్ ని నీ జేబుల్లోకి ఎక్కించింది నువ్వు ఆరాధించే నీ హీరోలే. ఒక ఆటగాడికి IPL కాంట్రాక్ట్ ద్వారా వాడికొచ్చేది కేవలం ₹21 కోట్లు అయితే, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, వాడు సంవత్సరానికి ₹200 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే, వాడు కేవలం అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడానికి మాత్రమే క్రికెట్ ఆడుతున్నాడు.
హీరో వర్షిప్ అనేది ఎప్పటినుంచో ఉన్న ఒక మానసిక రుగ్మత. నీలో ఏమీ లేదు కాబట్టి, ఆ ఖాళీని నింపుకోవడానికి ఎవడినో ఒకడిని హీరోని చేస్తావు. ఆ హీరో ఎవడో తెలుసా? నువ్వు చచ్చిపోతే, నీ శవం వైపు కూడా చూడని ఒక ఒక కార్పొరేట్ ఎంప్లాయ్. అరువు తెచ్చుకున్న గుర్తింపు ఒక మనిషిని ఎంతటి బానిసగా మారుస్తుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.
ఖాళి కుర్చీల్లో మిగిలిపోతున్న అసలైన సత్యం
నీ వాస్తవ జీవితాన్ని చూడటం కష్టమైనప్పుడే, ఇలాంటి వినోద వ్యాపారాలు పడగ విప్పుతాయి. ఈ వినోద పరిశ్రమ నీ మానసిక దారిద్ర్యం మీదే బతుకుతోంది. నువ్వు నిజమైన జీవితం జీవిస్తే, అర్థవంతమైన పని చేస్తే... ఈ చవకబారు వినోదాన్ని కొనేవాడే ఉండడు. ఐపీఎల్ అనేది, అదేదో గొప్ప ఆట గాబట్టి బతకడం లేదు... నీ లోపల ఉన్న శూన్యతను భరించడం, నీకుగా నీకే అంత కష్టంగా ఉంది గాబట్టది బతుకుతోంది.
ప్రతీ రాత్రి మ్యాచ్ ముగుస్తుంది. Screen off అవుతుంది. ఏ శూన్యాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఆ టీవీ ముందు కూర్చున్నావో, మ్యాచ్ అయిపోయాక ఆ శూన్యం మళ్ళీ అక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మ్యాచ్ ఓడిపోతే ఒక ఫ్రస్ట్రేషన్, గెలిస్తే ఒక గంటసేపు పనికిరాని ఆనందం.
నీకోసం నువ్వు బతుకు... వాడెవడో అమ్ముకుంటున్న జెర్సీ కోసం కాదు!
Nuvvu entha cheppina vellu mararu bro. Kani excellent ga cheppavu......
ReplyDeleteVideo చేయొచ్చు కదా
ReplyDelete